నిజామాబాద్, బతుకమ్మ: భూ వివాద కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు.. రంగారెడ్డి జిల్లా మోకిలా గ్రామంలోని 114 ఎకరాల భూమి కబ్జా ఆరోపణల నేపథ్యంలో భూ యజమాని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మోకిలా, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో జీవన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కేసులో నమోదు కావడంతో జీవన్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రత్యర్థులు ప్రచారం ప్రారంభించారు. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి తాత్కాలిక విజయం సాధించినట్లు అయిందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు ఆయనను అరెస్ట్ చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే, విచారణకు సహకరించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన మోకిలా పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు ముఖుల్ రోహిత్గి, నిరంజన్ రెడ్డి జీవన్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో జీవన్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
