- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గాను నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సాయంత్రం మత్స్య శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2024 – 2025 సంవత్సరానికి గాను వంద శాతం సబ్సిడీపై 799 చెరువులు, రిజర్వాయర్లలో కోటీ 92 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ ఏడాది 2025 – 2026 సంవత్సరానికి గాను 967 చెరువులలో 4.5 కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్దేశించిన లక్ష్యం మేరకు నాణ్యమైన చేప పిల్లల పెంపకానికి చొరవ చూపాలన్నారు. కట్ల, రహు, బంగారు తీగ రకాల చేప పిల్లలను పెంచడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 398 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 24,071 కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా తోడ్పాటును అందించాలని సూచించారు. మత్స్య కార్మిక సంఘాల సభ్యులు అందరూ ఎన్.ఎఫ్.డీ.పీ పథకం కింద ఆన్లైన్ లో సభ్యత్వ నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. డిచ్పల్లి, అర్సపల్లి ప్రాంతాలలో నూతనంగా మంజూరైన చేపల మార్కెట్ సముదాయాల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టి, పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
