27.5 C
Hyderabad
Friday, July 31, 2026

పెట్టారు.. తీసివేశారు..

Must read

📰 Generate e-Paper Clip

  • మున్నాళ్ళ ముచ్చటగా ‘విజయ’ కేంద్రాలు
  • అమ్మకాలు గాకుండా ప్లాంట్ సిబ్బంది అడ్డు
  • ఉత్పత్తి, విక్రయాలు పెరగడం గగనమే

నిజామాబాద్, బతుకమ్మ:

నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్లుగా తయారయింది విజయ డెయిరీ అధికారుల పరిస్థితి. పాల ఉత్పత్తిని పెంచి వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని డెయిరీ రాష్ట్ర చైర్మన్ అమిత్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ నాయకులు చెప్తే వినాలా… తమ పనులు చేసుకుంటామన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తున్నట్లు కనబడుతోంది. పదేపదే విజయ పాల గురించి ఎమ్మెల్యే ఆరా తీస్తుండడంతో ఇక తప్పదన్నట్లుగా నగరంలో పాల అమ్మకాలను పెంచుతామని డాంబికలు పలికారు. పాలిటెక్నిక్ కళాశాల ముందు, హమాలీవాడి, రాజ రాజేంద్ర చౌరస్తా, అర్సపల్లిలో కేంద్రాలను ఆడంబరంగా ప్రారంభించారు.

  • పెట్టారు… తీసివేశారు

నగరంలో వెలసిన విజయ పాల కేంద్రాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. వీటిపై పర్యవేక్షణ ఉన్నప్పటికీ డెయిరీ అధికారుల నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో పెట్టినవి తీసివేశారు. అర్సపల్లిలో కేంద్రం అని గాకుండా వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ అమ్మకాలు కొనసాగిస్తుండడంతో వినియోదారుల నుంచి స్పందన వచ్చింది. ప్రతిరోజు సుమారు 40 లీటర్ల వరకు పాలు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇలా పాల విక్రయాలు జరుగుతూ ఉండటంతో డెయిరి లోని అధికారులకు మింగుడు పడలేదు. ప్రతి కేంద్రం వద్ద అర్సపల్లిలో విక్రయించిన మాదిరిగానే వివిధ ప్రాంతాలలో అమ్మకాలు కొనసాగిస్తే, వినియోదారులు తీసుకునేందుకు ముందుకు వస్తారు. అమ్మకాలను పెంచడం ఇష్టం లేని అధికారుల తీరు వల్ల విజయ డెయిరీ ముందుకు వెళ్లడం లేదని క్షేత్రస్థాయిలోని సిబ్బంది నుంచి ఆరోపణలు వినబడుతున్నాయి.

  • అమ్మకాలు పెరగకుండా..

పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా దానికి సరి సమానంగా విక్రయాలు కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ప్లాంట్ అధికారులపై ఉంటుంది. అమ్మకాలు పెరిగితే తమ చీకటి దందా కనుమరుగవుతుందనే భయంతో విక్రయాలు పెరగకుండా పరోక్షంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని ప్లాంట్ సిబ్బంది మాట్లాడుకోవడం చర్చకు దారి తీస్తోంది. కేంద్రానికి పాలు ఎన్ని వస్తున్నాయో… అంతే పాలు బయట వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే విజయ డెయిరీ పాలు భూతద్దంలో వెదికిన కనిపించకపోవడం సిగ్గుచేటుగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. విజయ డెయిరీపై బోధన్ ఎమ్మెల్యే దృష్టి సారించడంతో ఆయన పర్యటనకు వచ్చినప్పుడు దర్శన భాగ్యం కల్పించుకొని బాగా పని చేస్తున్నట్లు నటించి వస్తున్నారని డెయిరీ అధికారుల గురించి గుర్తెరిగిన బోధన్ ప్రాంత వాసులు నవ్వుతున్నారు.

More articles

Latest article