27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బహిరంగ వేలాన్ని వెంటనే నిలిపివేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పసుపు కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను అరికట్టాలి

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌ లో ఈ-నామ్ విధానం ద్వారా కాకుండా బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు జరగడం వల్ల రైతులు మద్దతు ధర పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు నిజామాబాద్ గంజ్‌లో ధర్నా నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు రైతులు పంట అమ్ముకోవడంలో పడుతున్న ఇబ్బందులను తొలగించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మార్కెట్ యార్డ్‌ కు భారీగా పసుపు పంట వచ్చినప్పటికీ, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని అన్నారు. దీంతో రైతులు తమ పంట అమ్ముకోవడానికి మూడు, నాలుగు రోజుల పాటు మార్కెట్ యార్డ్‌ లో వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఇక్కడ బీజేపీ ఎంపీగా అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ఉండి కుడా లాభం లేకుండా పోయిందన్నారు.

. . . పసుపు రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు

ఇటీవల ఎంపీ అరవింద్ ఈ-నామ్ 1.50కింద కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికి కార్యరూపం దాల్చలేదని, సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి కొనుగోళ్లు నిలిపివేసి బహిరంగ వేలం నిర్వహించడం అన్యాయమని ఆయనన్నారు. మొదట ఈ-నామ్ 2.50గురించి మాట్లాడి, తర్వాత 1.50అని చెప్పడం రైతుల్లో గందరగోళం సృష్టించిందని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్‌లో పరిస్థితి దారుణంగా మారిందని, చాపల మార్కెట్‌ల మాదిరిగా బహిరంగ వేలం ద్వారా దళారులు కుమ్మక్కై తక్కువ ధరలకు పసుపు కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. పారదర్శకత లేకుండా బహిరంగ వేలం నిర్వహించడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, దళారులకు లాభం చేకూరుతోందని ఆయన తప్పుపట్టారు. మార్కెట్ యార్డ్‌ కు పసుపు తీసుకువచ్చిన రైతులు రోజుల తరబడి సరైన ధర కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని అన్నారు. దళారులు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేసే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బహిరంగ వేలం నిలిపివేయాలని, ఈ-నామ్ విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని, ఆన్ లైన్ విధానంలో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రైతులకు మద్దతు ధర కల్పించి పసుపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తున్న పసుపు రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడతామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

More articles

Latest article