- టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
హైదరాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఉద్యోగులకు న్యాయం జరగకపోతే జేఏసీ షెడ్యూల్ ప్రకారం నిరసన కార్యక్రమాలు చేపడతామని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు నెలల క్రితం మంత్రులతో కూడిన సబ్ కమిటీతో పాటు ఇటీవలే ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలించి 7 రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కోరినందుకు ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కొరకు, హక్కుల సాధన సిద్ధించే వరకు ఉద్యోగుల వెంట ఉంటూనే శాంతియుత వాతావరణం లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ,రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో నిజాంబాద్ జిల్లాలో ఉద్యోగుల సదస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల వలన ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనట్లయితే, ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జూన్ 9న ఇందిరాపార్క్ హైదరాబాద్ నందు ఏర్పాటు చేయబోయే మహాధర్నా కార్యక్రమంలో జిల్లా పక్షాన అధిక సంఖ్యలో ఉద్యోగులు హాజరై నిరసనను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతీకుంట శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు గంగా కిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
