మోర్తాడ్, బతుకమ్మ : యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనానికి కట్టేసి నిరసనకు దిగిన ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్ 6న విషం తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతోనే శ్రీకాంత్ చనిపోయాడని బంధువులు అతడి మృతదేహంతో శుక్రవారం ఉదయం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. తాళ్లరాంపూర్ రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో బంధువులు మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి నిరసన తెలిపారు. యువతి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీకాంత్ సెల్ఫీ వీడియో గతంలోనే విడుదల చేశాడు.
