తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించండి

0 1,361

. . .  అదనపు కలెక్టర్ కు పీడీఎస్ యూ నాయకుల వినతి

నిజామాబాద్, బతుకమ్మ :

 

కబ్జా అయినా తెలంగాణ యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకొని, కబ్జాదారుల నుండి రక్షించాలని, యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీగోడ నిర్మించుటకై తగు చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కర్క గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్ పల్లిలో  తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించారన్నారు. తెయూ భూముల్లో 54 ఎకరాలను తమ సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో భూమిని కాజేయాలని చూస్తే, అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాద్ లు సీరియస్ గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన ఎమ్మార్వో రవికుమార్ ను సస్పెండ్ చేశారన్నారు. ఈ భూములను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు కోర్టుకు వెళితే కోర్టు సైతం తెలంగాణ యూనివర్సిటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఈ 54 ఎకరాల తెయూ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల, కబ్జాదారుల నుండి కాపాడి పూర్తిస్థాయిలో తెలంగాణ యూనివర్సిటీకి అప్పగించాలని కోరారు. ఈ కేసులో  ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని  యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా కలెక్టర్ గా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు తరుణ్,మహేష్,సృజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.