27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పక్కాగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి

Must read

📰 Generate e-Paper Clip

  • లోలం గ్రామసభలో జిల్లా కలెక్టర్

 

ఇందల్వాయి,బతుకమ్మ : సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో సాలీనా 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సాగు భూమి లేకుండా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్దారించామని తెలిపారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రామ సభ వీటికి ఆమోదం తెలిపింది.ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారితో పాటు, అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు.
రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం
అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభలలో దరఖాస్తులు అందజేయవచ్చని, వీలుపడని వారు ఈ నెల 26 తరువాత ఎప్పుడైనా మండల కార్యాలయాలలోని ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జాతచేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భరోసా కల్పించారు. గ్రామ సభలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మండల ప్రత్యేక అధికారి వీరాస్వామి, స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Proper welfare schemes should reach the people

More articles

Latest article