. . . హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సులో డా.మురళీ కృష్ణ
డిచ్ పల్లి, బతుకమ్మ :
హెచ్.ఐ.వి రోగనిరోధక శక్తిని తగ్గించి, చికిత్స లేకపోతే ఎయిడ్స్ గా మారుతుందని, హెచ్ఐవి చికిత్స కన్నా దాని నివారణే మేలని డా. మురళీ కృష్ణ చౌదరపు (ఇన్‌చార్జ్ హెచ్ఓడి, ఫార్మకాలజీ విభాగం) తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం రెడ్ రిబ్బన్ క్లబ్, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) సెల్ ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ & మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నివారణపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్యవక్తగా విచ్చేసిన మురళీ కృష్ణ మాట్లాడుతూ హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, అపోహలు, స్టిగ్మా నిర్మూలనపై వివరించారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, ఇన్ఫెక్టెడ్ రక్తం, సూదులు పంచుకోవడం, తల్లి నుండి శిశువుకు వ్యాప్తి జరుగుతుందని వివరించారు. సురక్షిత లైంగిక చర్యలు, కండోమ్ వినియోగం, సురక్షిత రక్త వినియోగం వంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. పీఆర్ఈపీ వంటి నివారణ విధానాల గురించి కూడా అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఐసీటీసీ కేంద్రాల ద్వారా ఉచిత హెచ్ఐవీ పరీక్షలు, ఏఆర్టీ చికిత్స అందుబాటులో ఉన్నాయని, భయపడకుండా సమయానికి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీస్‌కు చెందిన జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సుధాకర్ చల్లా మాట్లాడుతూ 20 మార్చి 2026 నాటికి నిజామాబాద్‌లో 5,201 మంది హెచ్.ఐ.వి బాధితులు ఏఆర్టీ చికిత్స పొందుతున్నారని, ఇతర జిల్లాల నుంచి 1,061 మంది సేవలు పొందుతున్నారని తెలిపారు. స్నేహా సొసైటీ ద్వారా 67 హాట్‌స్పాట్లలో 8,787 హై-రిస్క్ వ్యక్తులకు స్క్రీనింగ్, మెడికల్ చెకప్‌లు, కండోమ్ పంపిణీ వంటి సేవలు అందుతున్నాయని చెప్పారు. మానవతా సదన్ (డిచ్‌పల్లి) లో హెచ్.ఐ.వి ప్రభావిత పిల్లలకు విద్య, ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నారని, “విజేత” కోఆపరేటివ్ సొసైటీ (1,150 సభ్యులు) ద్వారా చికిత్సలో క్రమశిక్షణ, ప్రభుత్వ పథకాలు, స్టిగ్మా తగ్గింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కె అపర్ణ, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ జి.రాంబాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వ్యాసరచన, పోస్టర్ మేకింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. “అవగాహనే రక్షణ – ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
