. . . డయల్ 100/112 సిబ్బందికి మేలకువలు నేర్పించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
డయల్ 100/112 ద్వారా కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడంలో సమయ పాలన పాటించాలని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డయల్ 100/112 వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేందుకు, అందులో ఎదురవుతున్న లోపాలను అధిగమించేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా కమిషనరేట్ పరిధిలో ని ఎస్.ఐ లకు సీఐ లకు, డయల్ 100/112 సిబ్బందికి సోమవారం శిక్షణ ఇప్పించారు. కాల్స్ స్వీకరించడంలో లేదా సమాచారాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసే బాధితులతో ఫోన్ రిసీవ్ చేసుకునే సిబ్బంది ఓపికగా, మర్యాదగా వ్యవహరించాలని, వారి నుండి పూర్తి వివరాలను సేకరించాలని కమిషనర్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ సిబ్బందికి, గస్తీ వాహనాల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని సూచించారు. డయల్ 100/112 కాల్స్ స్థితిగతులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్) బి.బస్వా రెడ్డి, హైదరాబాద్ నుండి వచ్చిన చీప్ టెక్నికల్ ఆఫీసర్ రాజీవ్ కృష్ణ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరీష్ కృష్ణ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సి టి సి, ఎసిపిలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్ బి ఇన్స్ పెక్టర్ అంజయ్య, సిఐలు, ఎస్సైలు, పోలీస్ స్టేషన్ రైటర్స్ డయల్ 100/112 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

