. . . జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జె.వెంకటి
కామారెడ్డి, బతుకమ్మ :
దేశ అభివృద్ధికి జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఎంతో కీలకమని, ప్రతి దంపతులు కుటుంబ నియంత్రణ పద్ధతులను స్వచ్ఛందంగా పాటించి తల్లి – శిశు ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. జె. వెంకటి సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి సిరిసిల్ల రోడ్డులోని రైల్వే స్టేషన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ర్యాలీ తిరిగి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. జె. వెంకటి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కుటుంబం ద్వారా ఆరోగ్యకరమైన, ఆర్థికంగా బలమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. రాజు, డా. వెంకటస్వామి, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు వేణుగోపాల్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి చెలపతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఠాగూర్, డీపీఓ పద్మజ, సలమ్మ, స్టాటిస్టికల్ ఆఫీసర్ విట్టల్ రావు, ప్రొజెక్షనిస్ట్ నయీం, జనాభా విభాగం డీపీహెచ్ఎన్ఓ సుధాకర్, రమేష్, శ్యామల, నవీన్, రవీందర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.

