- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్, బతుకమ్మ : భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు దక్కుతుందని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ సూచించారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమ వ్యవసాయ భూమిలోనే మామిడి చెట్టు నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. ఆ రోజుల్లో దళితులు శూద్రులు (ఎస్సీ ఎస్టీ బీసీ) స్త్రీలను విద్యకు దూరం చేయడానికి మనువాదంతో మనువాదులు ఎన్నో ఆంక్షలు పెట్టిన 1848 పూణేలో స్త్రీల కోసం ఒక మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేశారని

అన్నారు. పూలే దంపతులు స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా ఆన్నికలాలకు ఒకే దగ్గర బడి ఏర్పాటు చేశారని తెలిపారు. మూడు సంవత్సరాలు తిరగకముందే 70 బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత పూలే దంపతులకు మాత్రమె దక్కుతుందని అన్నారు. విద్యా వ్యాప్తికి వారి జీవితాలను పణంగా పెట్టారని, విద్య ఎంత అవసరమో దానిపై వారు ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చో వారు స్థాపించిన పాఠశాలలే నిదర్శనమని తెలిపారు. పూలే దంపతులు అణగారిన దళిత బహుజనులకు విద్యను అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రశంసించాల్సింది పోయి వారిని ఆ రోజుల్లో బ్రాహ్మణులు మనువాదులు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని, హిందు వ్యతిరేక విధానాలు చేపడుతున్నారని తిట్టేవారని అన్నారు. సావిత్రిబాయి పూలే వారి మాటలను పట్టించుకోకుండా స్త్రీల కోసం విద్యను అందించారని అన్నారు. బీసీ సంఘాల కోరిక మేరకు పూలే దంపతులకు భారత అవార్డును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి సిఫార్సు చేసీ వారి విగ్రహాలను పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కూడా ఆమె పేరిట ఒక స్మృతి వనాన్ని నిర్మించి సావిత్రిబాయి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు.

