హైదరాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారేగాం తండా గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందిస్తూనే ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ సాధించిన డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో “సమకాలీన హిందీ ఉపన్యాస్ మే సాంప్రదాయిక్ సంఘర్ష్” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసిన ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, భారతీయ బయోటెక్నాలజీ చైర్మన్ డా.కృష్ణ మిలా, విసి మొగలయ్య చేతుల మీదుగా డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ డాక్టరేట్‌ను స్వీకరించారు. ఒకవైపు గ్రామ సర్పంచ్‌గా ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూనే, మరోవైపు ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సర్పంచ్ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నత విద్యలోనూ రాణించి డాక్టరేట్ సాధించడం ద్వారా డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ మాట్లాడుతూ తన పరిశోధనకు సహకరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యా రంగంతో పాటు ప్రజాసేవలోనూ మరింతగా కృషి చేస్తానని తెలిపారు. డాక్టర్ రమావత్ లాల్‌సింగ్ సాధించిన ఈ ఘనత కారేగాం తండా ప్రజలకు గర్వకారణంగా నిలిచిందని గ్రామస్థులు, శ్రేయోభిలాషులు పేర్కొంటూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

