25.4 C
Hyderabad

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

Ganesh festivities should be celebrated in a peaceful atmosphere

Must read

📰 Generate e-Paper Clip

 

. . . శాంతి కమిటీ సమావేశంలో సీపీ, అదనపు కలెక్టర్

. . . అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు

. . . డీ.జే లపై నిషేధం అమలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. వినాయక చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలు, జెండా బాలాజీ జాతర సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు,ముస్లిం మత పెద్దలు,మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో,భక్తి శ్రద్ధలతో మతసామరస్యానికి ప్రతీకగా వేడుకలు జరిగేలా కృషి చేస్తామని అన్నారు. సీ.పీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావులు మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని,రోడ్ల మరమ్మతులు,శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని,జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరు కూడా విద్యుదాఘాతం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మంటపాల వివరాలను ట్రాన్స్ కో అధికారులకు తెలియజేసి,ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. షార్ట్ సర్క్యూట్ వంటి వాటిని నిరోధించే ఉపకరణాలను అమర్చుకోవాలని హితవు పలికారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వినాయక మంటపాలు ప్రతిష్టించాలని సూచించారు. 8 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలను మాత్రమే బాసర గోదావరిలో నిమజ్జనానికి అనుమతిస్తామని,అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఉమ్మెడ వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు. భారీ శబ్దాల వల్ల చిన్నారులు,వృద్దులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మంటపాల వద్ద డీ.జే సౌండ్లను నిషేదించడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. మండపాల వద్ద భక్తి పాటలు,భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. ఇతరులను కించపరిచేలా అసభ్యకరంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. మండపాల వద్ద రాత్రి సమయంలోనూ నిర్వాహకులలో ఎవరో ఒకరు తప్పనిసరిగా బస చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించేలా యువతను ప్రోత్సహిస్తూ పర్యావరణ హితానికి పాటుపడాలని హితవు పలికారు.

Ganesh festivities should be celebrated in a peaceful atmosphere

ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా విడనాడితే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారని అన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు,వదంతులను నమ్మకూడదని,ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని, ప్రతి ఒక్కరు సంయమనం పాటిస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు.  సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సి.సి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తామని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. సామాజిక మాధ్యమాల పోస్టింగ్ లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ప్రశాంతతకు భంగం కలిగిస్తూ,అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని,వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని,ప్రతి మండపం వద్ద పోలీసులను నియమిస్తామని అన్నారు. కాగా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రక్రియను ఆద్యంతం అధికారులు పర్యవేక్షణ జరపాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్,లైటింగ్ వ్యవస్థ,అత్యవసర వైద్యం, అంబులెన్స్, తాగునీరు, బారికేడింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ,పారిశుధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను అదనపు కలెక్టర్ భుజంగరావు ఆదేశించారు. గణేష్ ఉత్సవాలు,జెండా బాలాజీ వేడుకల సందర్భంగా నిర్ణీత రోజుల్లో మద్యం విక్రయాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని అవగాహన కల్పిస్తూ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్,ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, ఏసీపీలు ప్రకాష్,వెంకటేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్, మస్తాన్ అలీ, వివిధ శాఖల అధికారులు, సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Ganesh festivities should be celebrated in a peaceful atmosphere

More articles

Latest article