. . . సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న చలో అసెంబ్లీ కార్యక్రమం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ ని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ ఆశా వర్కర్లతో సుమారు గంట పాటు చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే. చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000 అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లతో పని చేయించుకుని పారితోషికం చెల్లించలేదని, వెంటనే వాటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1,500 పారితోషికాన్ని తక్షణం అమలు చేయాలని కోరారు. ఇంకా 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఆరు నెలల పీఆర్ సి బకాయిలను విడుదల చేయాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐ వంటి ఉద్యోగ భద్రతా సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై స్పందించిన షబ్బీర్ ఆలీ కొంత సమయం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి సీఐటీయూ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే ఈ నెల 28న “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరా, రాజశ్రీతో పాటు మమత, ప్రమీల, వనిత, లావణ్య, పద్మ, జ్యోతి, రమలత, శివరాజవ్వ, భాగ్యలక్ష్మి, మానస, మంజుల, గంగమణి, యశోద, సునీత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
