. . . ఆధ్యాత్మిక ప్రవచన కర్త ధరానంద భారతీ స్వామి
ఏర్గట్ల, బతుకమ్మ :
తత్త్వాన్ని తెలుసుకోవడం అంటే మన అసలు స్వరూపాన్ని గ్రహించడం అని, ధర్మమార్గంలో నడవడమని, సత్యాన్ని ఆచరించడమని, అలా చేసినప్పుడు మనం కేవలం పరిస్థితులను కాదు, మన తలరాతను కూడా మార్చుకోగలుగుతామని ఆధ్యాత్మిక ప్రవచన కర్త ధరానంద భారతీ స్వామి అన్నారు. మండలంలోని తడపాకల్ గోదావరి నదీ తీరాన గల దత్త సాయి బాబా మందిరం పంచమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక విజ్ఞాన మహాసభలలో జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజ్ఞాన మహాసభలో వైదిక ఆధ్యాత్మిక ప్రవచనవక్తలు ఆచార్య ధరానంద భారతీ స్వామి, వేద పునీతానంద భారతీ స్వామి, భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కారణం అతని ఆలోచనలు, కర్మలు, అవగాహన అని భారతీయ తత్త్వశాస్త్రం చెబుతుందని అన్నారు. ఉప నిషత్తులు, గీత వంటి శాస్త్రాలు మనకు ఈ జ్ఞానాన్ని బోధిస్తాయన్నారు. మనసు శుద్ధి, సద్భావనలు, సత్సంగం, సత్కర్మల ద్వారా జీవితం మారుతుందని భక్తులకు తెలిపారు. అజ్ఞానం మనిషిని బంధనంలో ఉంచితే, జ్ఞానం అతన్ని విముక్తి వైపు నడిపిస్తుందన్నారు. మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే మన చర్యలు కూడా మంచివైపుకు దారితీస్తాయని, ఫలితంగా మన భవిష్యత్తు కూడా మెరుగు పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీచర గ్రామానికి చెందిన విశ్వేశ్వరానందగిరి స్వామి, ఆశ్రమాలయ వ్యవస్థాపకులు నిర్గుణ తత్వ మహారాజ్, ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకులు కంకణాల రాజేశ్వర్, సాయిబాబా విగ్రహ దాత నిరోత్తం రెడ్డి, వివిధ గ్రామాల నుండి వచ్చిన సాయి భక్తులు, సేవకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
