. సత్వర న్యాయానికి చక్కని వేదిక
. రాజీ మార్గమే రాజమార్గం
. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేసుల శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ లో సాధ్యమవుతుందని, సత్వర న్యాయానికి చక్కని వేదిక అని జిల్లా ప్రధాన నాయమూర్తి సునీత కుంచాల అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో సత్వర న్యాయానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని, ఇక్కడ పరిష్కారమైన కేసుల్లో పైకోర్టులకు వెళ్లే ఆస్కారం ఉండదని అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించే విధంగా కక్షిదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని, నిజామాబాద్ జిల్లా కూడా టాప్ లో ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు డబ్బు ఆదా అవుతుందని, వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉండే వారి కేసులో పరిష్కారంపై లోక్ అదాలత్ ప్రత్యేక దృష్టి పెడుతుందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకునే అవకాశంకల్పిస్తుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ మూడు డివిజన్ ల పరిధిలో 12 బెంచ్ లను నడపడం జరుగుతుందన్నారు. రాజీమార్గమే రాజమార్గమనే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ కేసులను సత్వరమే పరిష్కరించే విధంగాఅందరిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. చెక్ బౌన్స్, కుటుంబ కలహాలు, స్థిర, చర ఆస్తుల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పద్మావతి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ గౌడ్, న్యాయవాది రాజేందర్ రెడ్డి, బ్యాంకుల మేనేజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

