. ప్రైవేట్ బడుల అనుమతులను నియంత్రించాలి
. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్
కామారెడ్డి, బతుకమ్మ: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సమావేశాన్ని చైర్మన్ పంపరి ప్రవీణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బదావత్ దేవుల అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల గణన సర్వే చేపట్టిన ఎన్యుమరేటర్లకు రెమ్యునరేషన్ ఇవ్వాలని, విధుల్లో చేరిన డీఎస్సీ – 2008 అభ్యర్థులకు వేతనాలు చెల్లించాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎస్సెస్సీ మూల్యాంకనం రెమ్యునరేషన్ పెంచాలని, జుక్కల్ మండలంలో సస్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలని, ప్రవేశాలు మెరుగు పర్చిన వారికి బదిలీలు, పదోన్నతులలో పాయింట్స్ వారీగా ప్రాధాన్యత ఇస్తామనడం తగదన్నారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్లు ఉన్న చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఎటి పరిస్థితుల్లో ప్రవేశాలు పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ బడుల అనుమతులను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో హన్మంత్ రెడ్డి, ప్రభాకర్, ఎస్ రాములు, పందిరి రాజేశ్, ముజీబుద్దీన్, కుంట రాములు, స్వామియాదయ్య, సిరిసిల్ల గఫూర్ శిక్షక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
