
నిజామాబాద్, బతుకమ్మ: దేశ రక్షణ కోసం సాయుధ దళాల చేస్తున్న కృషితోనే ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, వారి త్యాగాలను ప్రతి పౌరుడూ గుర్తించి సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఎన్ సీ సీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ అంకిత్ తో పాటు కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమవంతుగా విరాళాలు అందించారు. ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇన్ చార్జి అధికారి రమేశ్, కార్యాలయ సిబ్బంది సులేమాన్, బదాం గంగామోహన్, ఉమేర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.ప్రసాద్, కార్యదర్శి బి.రవికాంత్, ఎం.దివాకర్ రెడ్డి, గుజరాతీ మోహన్, అబ్రహం, సుజాత, సరస్వతి, లలిత, లక్ష్మీ, జయశ్రీ, కామారెడ్డి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ సైనికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

