హైదరాబాద్, బతుకమ్మ: నకిలీ ఫెస్టిసైడ్స్ విక్రయించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంతోపాటు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రిని జాతీయ ఆగ్రో కెమికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడారు. పురుగు మందుల క్రయ విక్రయాలు, నిల్వల సమాచారాన్ని నమోదు చేసేందుకు ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభిస్తామని అన్నారు. దుకాణదారుల లైసెన్స్ ను ఆన్ లైన్ చేశామని, రాష్ర్టంలో పురుగు మందుల నమూనాలను పరిశీలించే కేంద్రాలు రెండు కొనసాగుతున్నాయని తెలిపారు. పురుగు మందుల వినియోగాన్ని నియంత్రించే విధంగా పని చేయాలని ఆగ్రో కెమికల్స్ ప్రతినిధులకు ఆయన సూచించారు.
