- వడ్డీ వ్యాపారుల వెనుక పలువురు ఖాకీలు..
- పోలీస్ స్టేషన్ లలోనే సెటిల్ మెంట్లు
- గతంలో ఠాణాల్లో వెలుగు చూసిన ఘటనలు
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ రోడ్డులో ఓ వ్యక్తికి అర ఎకరం వ్యవసాయభూమి ఉంది. సదరు వ్యక్తి తన అవసరాల నిమిత్తం ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.21లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీ వ్యాపారిని ఆ వ్యక్తికి చెందిన భూమిని రిజిస్ర్టేషన్ చేసుకుని డబ్బులు ఇచ్చాడు. అప్పు తీసుకున్న వ్యక్తి కొంత కాలం తరువాత రూ.19 లక్షలు తిరిగి చెల్లించాడు. మిగతా మొత్తాన్ని తన భూమి విక్రయించి కట్టేస్తానని చెప్పాడు. రూ.కోటి విలువ చేసే ఆ భూమిపై కన్నేసిన వడ్డీ వ్యాపారి తిరిగి బాధితుడి పేరుపై రిజిస్ర్టేషన్ చేసి ఇచ్చేందుకు నిరాకరించాడు. పంచాయితీని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ కు చేర్చాడు. అక్కడి కి వెళ్లిన బాధితుడు తనకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. సదరు ఠాణా అధికారి బాధితుడిని ఉల్టా బెదిరించి మరోసారి భూమి అడిగనని స్టేషన్ లో లెటర్ రాయించాడు. దీంతో బాధితుడు తాను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు.
ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కీలక అధికారికి వరుసకు అల్లుడైన వడ్డీ వ్యాపారి వేధింపుల కారణంగా ఓ వ్యక్తి అశోక్ సాగర్ లో దుకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల కోసం అప్పుతీసుకున్న వ్యక్తిని వడ్డీ వ్యాపారి అయిన పోలీసు అధికారి బంధువులు తీవ్రంగా వేధించాడు. అంతటితో ఆగకుండా అతడిని సంబంధం లేని కేసులో పోలీస్ స్టేషన్ కు పిలిపించగా, సదరు అధికారి బాధితుడితో బలవంతంగా లెటర్ రాయించాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన బాధితుడు చివరకు బలవన్మరణం పాలయ్యాడు. బాధిత కుటుంబం దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కాని ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నిజామాబాద్ జిల్లాలోని పోలీస్టేషన్ ల పరిధిలోని వడ్డీ వ్యాపారులు స్టేషన్ లను తమ అడ్డాలుగా చేసుకుని పలువురు పోలీసుల అండదండలతో దందా చేస్తున్నారే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సామన్యులకు వారి అవసరాల నిమిత్తం అప్పులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులు వసూళ్లకు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటు, దౌర్జన్యంగా అస్థులను, విలువైన కార్లు, బంగారం లాంటి సామాగ్రీనీ లాక్కుంటున్నారు. ఆ ప్రైవేట్ సైన్యం వసూళ్లకు వెళ్లి దౌర్జన్యాలు చేసినా వడ్డీ వ్యాపారులతో దోస్తీ కారణంగా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వడ్డీ వ్యాపారులపై ఫిర్యాదులు వస్తే కొందరు పోలీసులు వారికి ముందే సమాచారం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులు అప్పులు, రిజిస్ట్రేషన్ ల వ్యవహరం సీవిల్ మ్యాటర్ ఐనప్పటికి పోలీస్ స్టేషన్ కు అయా పంచాయతీలు చేరితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బేదిరింపులు షరా మామూలుగా మారాయి. నగరానికి దగ్గరలోనే ఉన్న ఓ మండల పోలీస్ స్టేషన్ లోనైతే ఠాణా అధికారే దగ్గరుండి పంచాయితీలు చేయిస్తుండడం కొసమెరుపు.
