25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అతి చేస్తున్న హెడ్ మాస్టార్లు

Must read

📰 Generate e-Paper Clip

  • పాఠాలు చెప్పడం మానేసిన హెడ్ మాస్టార్లు
  • విద్యార్థులు, ఉపాధ్యాయుల సమన్వయంలో గురువుల విఫలం
  • ఇటీవల కాలంలో జిల్లాలో తీవ్రమైన ఆరోపణలు
  • పట్టించుకోని మండల, జిల్లా విద్యాశాఖాధికారులు

 

నిజామాబాద్, బతుకమ్మ : తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రాధాన్యత ఇచ్చింది సమాజం. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్న సామేత ఉండనే ఉంది. గురువును మించిన వారు ఆర్యోక్తి ఉంది. అటువంటి గురువు వ్యవస్థకు ప్రధానమైన విద్య వ్యవస్థలో ఇటీవల పెడదోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రధానోపాధ్యాయులు మరికొందరు ఉపాద్యాయుల తీరుతో విద్యా వ్యవస్థపై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న రమావత్ చరణ్ విద్యార్థి గత నెలలో జరిగిన బతుకమ్మ పండుగ సందర్భంగా సెల్ ఫోన్ ను స్కూల్ కు తీసుకువచ్చాడని హెడ్ మాస్టార్ విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించడం కలకలం రేపింది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చివరి వరకు విద్యార్థులు ఎన్నడు వచ్చినా పాఠశాలలో చేర్చుకోవాలని నిబంధన ఉంది కానీ విద్యార్థులను దండించే విధానం ప్రధానోపాధ్యాయులకు లేదు. విద్యార్థులను సక్రమ మార్గంలో నడిపేందుకు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సన్మార్గంలో వెళ్లాలని సూచించే చోట విద్యార్థికి టీసీ ఇచ్చి పంపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై గిరిజన సంఘాలు జిల్లా అధికార యంత్రాంగానికి, విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో దిగి వచ్చిన హెడ్ మాస్టార్ సదరు విద్యార్థినిని తిరిగి పాఠశాలలో చేర్చుకున్నట్లు సమాచారం.

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులపై వివాదాలలో మునిగి తేలుతున్నారు. రుద్రూర్ మండలంలోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు చెప్పులతో కొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. సిరికొండ మండలంలో విద్యార్థిని కొట్టిన హెడ్ మాస్టార్ ను సస్పెండ్ చేయాలని జరిగిన ఆందోళన వెనుక ఉపాధ్యాయులే ఉండడం విశేషం. వర్ని మోడల్ స్కూల్ లో విద్యార్థినిల పట్ల హెడ్ మాస్టార్ వ్యవహరించిన తీరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు పాఠశాలలో నిధుల దుర్వినియోగం వ్యవహరం ఇప్పటికి తేలనే లేదు. బోధన్, నందిపేట్, నవీపేట్ పాఠశాలల వివాదాలున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టార్ మిడ్ డే మిల్స్ బియ్యాన్ని నిల్వ చేసిన వ్యవహరంలో సస్పెండ్ కు గురయ్యారు. ధర్పల్లి మండలం దుబ్బాకలోని పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయలేదన్న ఆరోపణలున్నాయి. మాక్లూర్ కేజీబీవీలో జరిగిన వివాదం ఉపాధ్యాయునిల బదిలీ వరకు తీసుకెళ్లింది. ఆర్మూర్ పట్టణంలోని కేజీబీవీలో గతేడాది జరిగిన ఉదంతం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది.

నిజామాబాద్ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో పాఠాలు చెప్పడం లేదన్న ఆరోపణలున్నాయి. వారానికి 8 తరగతులు విద్యాబోధన చేయాల్సి ఉండగా వాటిని విస్మరించారు. పాఠశాలలో ఉపాధ్యాయులను, విద్యార్థులను సమన్వయం చేయాల్సిన హెడ్ మాస్టార్లు తమ విధి నిర్వహణను మరిచారు. కొందరు ప్రధానోపాధ్యాయుల కారణంగా విద్యా వ్యవస్థ పై, గురువులపై గౌరవం పోతుంది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించడంలో చూపిన శ్రద్ద ఆడిట్ జరిగినప్పుడు అమ్యామ్యాలు ఇచ్చి తప్పించుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. సంబంధిత ఆడిట్ వ్యవహరాలను చూడాల్సిన ఎంఈవోలు, డిఈవోలు ఈ వ్యవహరాన్ని పట్టించుకోవడం లేదు. ఎమ్మార్సీలు మొదలుకుని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు పేపర్ బండల్స్, కూలర్లు కావాలని, అల్మారాలు కొనివ్వాలని, కుర్చీలు కొనివ్వాలని పేచీలు పెడుతూ హెడ్ మాస్టార్ల వ్యవహర శైలిని పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. ఉపాధ్యాయుల ముందు పారదర్శకంగా జరుగాల్సిన పాఠశాల గ్రాంట్ల నిధులు, మధ్యాహ్న భోజనం నిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల నిధులలో చేతివాటం ప్రదర్శిస్తుండడంతో హెడ్ మాస్టార్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్ జీటీల ముందు చులకనగా మారారు. దానితో వారు పాఠశాలలకు సమయపాలన పాటించకపోయినా, పర్మిషన్లు తీసుకునేటప్పుడు హెడ్ మాస్టార్లను ఖతారు చేయడం లేదు. దానితో ప్రధానంగా పాఠశాలకు తండ్రి లాంటి ప్రధానోపాధ్యాయుడు తప్పుదోవన పడుతుండగా కింద పని చేసే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల పట్ల వేదింపులకు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు కారణంగానే మొత్తం విద్యావ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మండల విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారి హెడ్ మాస్టార్ల పనితీరు పర్యవేక్షించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. విద్యాశాఖను జిల్లా అధికార యంత్రాంగం పాలనాధికారులు హెడ్ మాస్టార్లపై వదిలివేయడంతో వారిపై అజామాయిషి కరువైంది.

More articles

Latest article