29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకే “మన ఇసుక వాహనం” ఆన్లైన్ విధానం

Must read

📰 Generate e-Paper Clip

. . . రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా వెల్లడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇసుక అక్రమ రవాణాకు కళ్ళెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం “మన ఇసుక వాహనం” ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తెస్తోందని రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా వెల్లడించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, మైనింగ్, హౌసింగ్ తదితర శాఖలు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం అమలు విధానం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని సంకల్పించిందన్నారు. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో ఈ విధానాన్ని గురువారం ప్రవేశపెట్టామని, నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం, కరీంనగర్ లో శనివారం ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. మ్యానువల్ విధానానికి స్వస్తి పలుకుతూ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఇసుక రవాణా జరిగేలా మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. దీనివల్ల ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండదని, ఇసుక అవసరం ఉన్న ఇందిరమ్మ లబ్దిదారులు, నిర్మాణ పనులు చేపడుతున్న ఇతరులు మొబైల్ లో మన ఇసుక వాహనం యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అవసరం అయిన మేరకు ఇసుక నిల్వల కోసం ఆన్లైన్ పద్ధతిలో బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని వారు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి, ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా ఇసుకను అందించడం జరుగుతుందని, ఇసుక పక్కదారి పట్టడం వంటివి జరుగవని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి నిర్ణీత రూపంలో ఆదాయం కూడా సక్రమంగా చేకూరుతుందని భవేష్ మిశ్రా తెలిపారు. గత ఏడాది రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వానికి రూ. 738 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి రూ. వేయి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానం అమలులో చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతి రాజ్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. నాలుగు జిల్లాలలో ప్రయోగాత్మక అమలు తీరును అధ్యయనం చేసిన మీదట, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయనుందని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కోసం నిజామాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినందున సంబంధిత శాఖల అధికారులు ఈ విధానం విజయవంతంగా అమలయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. తాము అధికారులను ఇబ్బంది పెట్టబోమని, అదే సమయంలో అక్రమాలకు తావిచ్చే అధికారులను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ కరాఖండీగా తేల్చి చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసిల్దార్లు కార్యస్థానాలలో ఉంటూ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు గట్టి పర్యవేక్షణ జరపాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీఓకు సూచించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, మైనింగ్ ఏ.డీ సంజయ్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, నివర్తి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

 

"Our Sand Vehicle" online system to curb illegal sand transportation
"Our Sand Vehicle" online system to curb illegal sand transportation

More articles

Latest article