. . . డీసీసీలకు శిక్షణా శిబిరం స్పూర్తిని నింపింది
. . . డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
వికారాబాద్ జిల్లాలో ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ శిబిరం మాలో కొత్త స్పూర్తిని నింపిందని, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి ని చేయడమే మా లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ సచిన్ రావు, సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ శిక్షణ శిబిరంలో పాల్గొని దిశా నిర్దేశం చేశారన్నారు. 10 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం యోగా చేయించడంతో పాటు దేశ స్వాతంత్ర్యం తర్వాత దేశాభివద్దిలో కాంగ్రెస్ పాత్రను వివరించారన్నారు. శిక్షణ శిబిరంలో తన రాజకీయ అనుభవాలను పంచుకుంటూ 1988 లో తాను సర్పంచ్ గా గెలిచిన సమయంలో తన గ్రామంలో నెలకొన్న తీవ్రమైన కుల వివక్షను గుర్తు చేసుకున్నారు. టీ హోటళ్లలో దళితులకు వేరే గ్లాసులు ఉంచేవారని, ఆ వివక్షను నిర్మూలించి అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలనే లక్ష్యంతో నాటి పంచాయతీలొ మొదటి తీర్మానం కుల వివక్షకు వ్యతిరేకంగా చేశానని శిబిరంలోని నేతలకు వివరించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం పాకులాడే వేదిక కాదని, కింది స్థాయి కార్యకర్తలకు, ఓటర్లకు సేవ చేసే సైన్యమని ఆయనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలకు సర్వేలు చేసి డీసీసీ లుగా నియమించారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ను కేసీఆర్ తన దొంగ దీక్షలతో సాధించలేదని, సోనియా గాంధీ ఇస్తేనే రాష్ట్రం ఏర్పడిందని ఆయన విమర్శించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన ఘనత కేసీఆర్దేనని దుయ్యబట్టారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసి కేసీఆర్ గద్దెనెక్కి కూర్చున్నాడని, అభివద్ది శూన్యం చేసి ప్రజా ధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చోరవతో భీంగల్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు 8 గెలుచుకున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామని, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామక్రిష్ణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు జావీద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, ఎఐసిసి పరిశీలకులు గన్ రాజ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, నగర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సుభాష్ జాదవ్, నితిన్,మాజీ సర్పంచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
