27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కనువిప్పు.. ఎవరికి..?

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లాలో జోరుగా చర్చ

 

నిజామాబాద్, బతుకమ్మ: గల్ప్ బాధితుల సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాల్కొండ నియోజకవర్గంలో మంటలు పుట్టించిన విషయం తెల్సిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సవాళ్ళు, ప్రతిసవాళ్లు విసురుకున్న విషయం విధితమే. విపక్ష పార్టీ నాయకులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ప్ బాధితులను పట్టించుకున్న వారి జాబితాతో సిద్దమని చెబుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తెలంగాణ సహకార సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కనువిప్పు పెరుతో చలో బాల్కొండకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కడంతో కమిషనరేట్ పరిధిలో 163 సెక్షన్ అమలులో ఉందని కనువిప్పు కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసు బాస్ ఒక రోజు ముందుగానే ఆంక్షలను విధించారు. ఆంక్షలను తోసిరాజని కాంగ్రెస్ నాయకులు బాల్కొండకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో మానాల మోహన్ రెడ్డిని, బాల్కొండలో ముత్యాల సునీల్ రెడ్డిని, హైదరాబాద్ లో అన్వేష్ రెడ్డిని, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. కానీ బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టి అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల కళ్ళుగప్పి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లగా వారు అక్కడ దాడి చేశారు. దానితో అక్కడ పలువురిపై కేసు నమోదు చేశారు. ప్రెస్ మీట్ లు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం దూషించుకున్నారు. దానితో కనువిప్పు కార్యక్రమానికి తెరపడింది.

  • బాల్కొండ రాజకీయంలో మైలేజి వేటలో హస్తం నేతలు..

గత వారం బాల్కొండ నియోజకవర్గం కేంద్రంగా జరిగిన కనువిప్పు కార్యక్రమం ఎవరికి మైలేజ్ అన్న చర్చ మొదలయింది. అధికార, విపక్ష పార్టీ నాయకుల మధ్య మొదలైన మాటలయుద్దం చిలికి చిలికి గాలివానలా మారి ఎవరి సత్తా ఏమిటో చూపుదామంటూ కనువిప్పు కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వగా, బీఆర్ఎస్ నాయకులు తాడోపేడో తేల్చుకుందామని పరస్పరం సవాళ్ళు విసురుకున్న విషయం తెల్సిందే. ఈ వ్యవహరంలో కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి ఒకవైపు మరోవైపు నియోజకవర్గ ఇంచార్జి సునీల్ రెడ్డి మరోవైపు అక్కడ స్థానికంగా తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌజ్ అరెస్టు చేసి వారిని ముందుకు కదలినియ్యలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ నేతలు ఇచ్చిన చలో బాల్కొండ కోసం కష్టపడ్డారు. అయితే బాల్కొండ నియోజకవర్గంపై  కన్నేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఒక వైపు, నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి ఒక వైపు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ మరోవైపు, రాష్ట్ర సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు మరోవైపు కనువిప్పు కార్యక్రమాన్ని ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహరంలో నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు వారే బయటపెట్టుకోగా మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్ లు ఒకవైపుగా, సునీల్ రెడ్డి ఒకవైపుగా ఉన్నట్లు రాజకీయం నడిపారు.

  • కనువిప్పుతో మైలేజి ఎవరికి వచ్చింది..

బాల్కొండ నియోజకవర్గంలో కనువిప్పు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడితే మైలేజ్ మాత్రం బీఆర్ఎస్ కు దక్కినట్లయింది. బీఆర్ఎస్ లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నప్పటికీ తన అనుచరులను, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ ను ఎదుర్కొన్న తీరు చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పార్టీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన పార్టీలో తన పట్టు నిలుపుకుంటునే నియోజకవర్గంలోనూ తనకు ప్రత్నామ్నాయం లేదని నిరూపించుకున్నట్లయింది. ప్రశాంత్ రెడ్డి తన అనుచరులపై కేసులు నమోదైనప్పటికీ హైదరాబాద్ లో ఉంటునే వారికి బెయిల్ ఇప్పించి అనుచరులను కాపాడుకున్నారని పార్టీలో చెబుకుంటున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే బాల్కొండ నియోజకవర్గంలో నాలుగు ముక్కలాటగా పరిస్థితి ఉంది. ఎవరికి వారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీటుపై కర్చీప్ వేసుకునేందుకు ముందు జాగ్రత్త పడుతున్నట్లుగా రాజకీయం కనబడుతుంది.

More articles

Latest article