జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ సోమవారం ఒక్క దరఖాస్తు మాత్రమే స్వీకరించబడింది. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాము, మహిళా సంఘం అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఇతర శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజావాణి నిర్వహణపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణిలో పాల్గొన్న ఆయిల్‌వార్ గ్రామానికి చెందిన రవి తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ అండ్ బి రోడ్డుకు ఆనుకుని గుడిసెలో నివాసం ఉంటున్నప్పటికీ, పలుమార్లు దరఖాస్తులు సమర్పించినా ఇప్పటివరకు అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, అధికారులు స్పందించకపోతే దాని ఉద్దేశం నెరవేరదని రవి అన్నారు. తనకు సొంత ఇల్లు లేదా స్థలం లేదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తన సమస్యను వెంటనే పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని రవి హెచ్చరించారు. ప్రజావాణికి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిశీలించి, ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
