నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
ఒక మహిళకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసి, అక్రమంగా నిర్భందించి, బెదిరించిన నేరాలలో పది, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల జైలుశిక్షలు విదిస్తూ మహిళలపై అత్యాచారాలను విచారించే న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన యాభై ఆరు పేజీల తీర్పులోని వివరాలు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన దేమే సాయి కిరణ్ కు నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువతి దగ్గరి బంధువు అవుతుంది. వీరు అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకునే వారు. ఒకరోజు ఆమెకు ఫోన్ చేసి దసరా పండుగకు హైదరాబాద్ లో షాపింగ్ చేద్దామని కోరాడు. అతనిని నమ్మిన ఆమె అతనితో కలిసి హైదరాబాద్ కు బయలుదేరింది. హైదరాబాద్ లోని కొంపల్లి లోని తనకు తెలిసిన స్నేహితుల రూమ్ కు తీసుకువెళ్ళాడు. ఆమెను రూమ్ లో అక్రమంగా బంధించి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె ఎంత ప్రాధేయ పడిన కనికరం చూపలేదు, ఎడమ చేతికి చాకుతో గాయం చేశాడు. అత్యాచార విషయం నీ తల్లితండ్రులకు, బంధువులకు చెప్తానని, ఫొటోలు తీశానని అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. నీ తల్లితండ్రులను చంపి వేస్తానంటు నేరపూరిత చర్యలకు ఒడిగట్టాడు. ఇలా రెండు రోజులు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఎవరికి చెప్పవద్దని బెదిరించి నిజామాబాద్ పంపించాడు. తల్లితండ్రులను ఆశ్రయించిన ఆమె గ్రామంలోని మెడికల్ ప్రాక్టీష్నర్ వద్ద ప్రథమ వైద్య పరీక్షలు చేయించుకుని నవీపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి కిరణ్ ను అతని తల్లి సుజాత, తండ్రి గంగాధర్, అన్న కృష్ణ ప్రోత్సహించినారని తెలిపింది. అయితే ఈ కేసులో తల్లి సుజాత తండ్రి గంగాధర్, కృష్ణ లపై వచ్చిన అభియోగాలపై సాక్షాదారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించారు. సాయి కిరణ్ పై నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు స్పెషల్ సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో పేర్కొన్నారు. సాయి కిరణ్ పై అత్యాచార అభియోగాలు నిర్దారణ కావడంతో భారత శిక్షస్కృతిలోని సెక్షన్ 376(2)(ఎన్) ప్రకారం పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలన్నారు. సెక్షన్ 342 ఒక రూమ్ లో అక్రమంగా నిర్భందించిన నేరంకు గాను ఒక సంవత్సరం జైలుశిక్ష వేయి రూపాయల జరిమానా, సెక్షన్ 506 నేర పూరిత బెదిరింపులకుగాను రెండు సంవత్సరాల జైలుశిక్ష వేయి రూపాయల జరిమానా విధించారు. శిక్షలన్ని ఏక కాలంలో అనుభవించాలని జడ్జి తమ తీర్పులో వ్రాశారు.
