27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపు

 

నిజామాబాద్, బతుకమ్మ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా, సహకార సంఘం ఎరువుల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టిన నూత్ పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపిడి గంగారెడ్డి కలెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. గత మూడు సంవత్సరాల క్రితం తాను నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ సబ్సిడీతో ఆయిల్ పామ్ పంట వేశానని, ప్రస్తుతం తొలి దిగుబడి చేతికి వచ్చిందని రైతు తెలిపారు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. డ్రిప్ ఏర్పాటు కోసం 90 శాతం సబ్సిడీతో ప్రభుత్వమే డ్రిప్ పరికరాలను సమకూర్చిందని అన్నారు. తనతో పాటు మరో పది మంది రైతులు కలిసి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్లి ముందుగా ఆయిల్ పామ్ సాగును అధ్యయనం చేశామని, ఏ రకంగా చూసినా ఈ పంట అధిక లాభాలు అందిస్తుందని గమనించి తాము కూడా ఆయిల్ పామ్ సాగు చేశామన్నారు. పసుపు, మొక్కజొన్న వంటివి పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరం అని నిరూపితం అయ్యిందని రైతు గంగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బైబ్యాక్ ఒప్పందాన్ని అనుసరిస్తూ, ప్రీ-యూనిక్ కంపెనీ వారు మద్దతు ధర చెల్లిస్తూ పంట దిగుబడిని సేకరిస్తున్నారని అన్నారు. పంట సాగులో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, పైపెచ్చు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు శ్రమ కూడా ఎంతో తక్కువ అని తన స్వియానుభావాన్ని వెల్లడించారు. ఏ రకంగా చూసినా అధిక ప్రయోజనాలు అందించే ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరమని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదర్శ రైతు గంగారెడ్డిని అభినందించారు. ఇతర రైతులు కూడా ఇదే స్పూర్తితో ఆయిల్ పామ్ సాగును చేపట్టి ఆర్ధిక పరిపుష్టి సాధించాలని అన్నారు. ఈ పంట సాగుకు జిల్లాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, చేపూర్ వద్ద గల నర్సరీలో నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. స్థానికంగా జిల్లాలోనే ఆయిల్  పామ్ ఫాక్టరీ కూడా ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ పంట గురించి, మార్కెట్ లో దీనికి గల డిమాండ్ గురించి ప్రతి రైతు తెలుసుకోవాలని సూచించారు. వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని, ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలీనా 4200 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఇన్ పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను 90 శాతం సబ్సిడీతో మంజూరు చేస్తోందని, ఆయిల్ పామ్ మొక్కలపై కూడా సబ్సిడీని అందిస్తోందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, మద్దతు ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదన్నారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను సైతం పొందవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్ ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఒక్కసారి ఆయిల్ పామ్ సాగు చేపడితే, కనీసం ముప్పై సంవత్సరాల పాటు ఈ పంట ద్వారా ఏటేటా గణనీయమైన ఆదాయం పొందవచ్చని సూచించారు.  ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ తెలిపారు.

Oil palm cultivation should be promoted.

More articles

Latest article