. రిటైర్డ్ ఉద్యోగులతో ఆర్టీసీ సంస్థను నడిపించారు
. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నిజామాబాద్, బతుకమ్మ: ఆర్టీసీని రిటైర్డ్ ఉద్యోగులతో నడిపించిన గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త బస్సునూ కొనుగోలు చేయలేదని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం మంత్రి ఎలక్ర్టికల్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య రహిత సమాజమే ధ్యేయంగా ఎలక్ర్టికల్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు కొత్త బస్సులను కొంటున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చామని, సంస్థలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశామన్నారు. మహాలక్ష్మి పథకం సక్సెస్ కు సంస్థ సిబ్బంది కృషి కారణమని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణగుప్తా, భూపతిరెడ్డి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

