. . . డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
జుక్కల్, బతుకమ్మ :
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలకమని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడడంలో ప్రతి బీఎల్ఎ చేసిన కృషి ప్రశంసనీయమని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జుక్కల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఎ లు) సేవలను ప్రత్యేకంగా అభినందించారు. అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా బీఎల్ఎ లు అత్యంత బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఇదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలుస్తూ, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, బీఎల్ఎ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
