- మూడు నెలలుగా భర్తీకాని ఆదిలాబాద్ విద్యాశాఖ సూపరింటెండెంట్ పోస్టు
- ఆర్జేడీ కార్యాలయం తాత్సారం చేయడమెందుకో..?
- ఎవరికోసమో నిరీక్షణ..
- నిజామాబాద్ లో ఖాళీ అయ్యే పోస్టుపై కన్ను
- ఇక్కడి పోస్టు కోసం పైరవీలు
నిజామాబాద్, బతుకమ్మ: ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖలో ఖాళీ అయిన సూపరింటెండెంట్ పోస్టు భర్తీ చేయకుండా రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఆర్జేడీ) వరంగల్ తాత్సారం చేస్తుండడం చర్చనీయాంశమైంది. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల తీరు, వారి అలసత్వానికి అద్దం పట్టేలా ఈ పోస్టు భర్తీ వ్యవహారం సాగుతోందనే విద్యాశాఖ ఉద్యోగులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఉద్యోగ విరమణ పొందారు. ఖాళీ అయిన ఆ పోస్టును ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 317 ప్రకారం కొత్త జోన్ ల ప్రాతిపదికన బాసర జోన్ లోని నాలుగు జిల్లాల విద్యాశాఖ అధికారుల పరిధిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ద్వారా భర్తీ చేయాలి. దానికనుగుణంగా మార్చి 10వ తేదీన జగిత్యాల జిల్లా డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగికి ప్రమోషన్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే సదరు ఉద్యోగి తనకు ప్రమోషన్ ఇష్టం లేదని, తాను జాయిన్ కాదల్చుకోలేదని లిఖిత పూర్వకంగా లేఖను ఆర్జేడీ కార్యాలయంలో అందజేశాడు. ఆ తరువాత క్రమంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కు వెంటనే ప్రమోషన్ ఇవ్వాల్సి ఉండగా, 25 రోజులు ఆలస్యం చేసి ఏప్రిల్ 21వ తేదీన బాసర జోన్ పరిధిలో సీనియర్ అయిన నిజామాబాద్ డీఈవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కు ప్రమోషన్ ఉత్తర్వులను ఆర్జేడీ కార్యాలయం నుంచి వెలువడ్డాయి. కానీ ఉద్యోగి సైతం తనకు ఆ ప్రమోషన్ అవసరం లేదని, ఆ పోస్టులో జాయిన్ కాదల్చుకోలేదని లిఖితపూర్వక లెటర్ ను ఆర్జేడీ కార్యాలయంలో అందజేశాడు. ఇద్దరు తమకు ప్రమోషన్ ఇష్టం లేదని ఆర్జేడీ కార్యాలయానికి స్పష్టం చేసి 20 రోజులు గడుస్తున్నా బాసర జోన్ లోని తరువాతి సీనియర్ అసిస్టెంట్ కు ప్రమోషన్ ఇవ్వడం లేదు. మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ పోస్టు భర్తీకి సంబంధించి పదోన్నతి ఉత్తర్వులు ఇవ్వడంలో ఆర్జేడీ కార్యాలయం అధికారులు ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని, ఎవరి కోసం నిరీక్షిస్తున్నారోనని విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు.
- భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు…
తమ వద్ద ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయాలని ఆదిలాబాద్ డీఈవో కార్యాలయ అధికారులు ఆర్జేడీ కార్యాలయానికి విన్నవిస్తున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పోస్టు ఖాళీగా ఉండటంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విన్నవించినా కూడా ఆర్జేడీ ఆఫీసు అధికారులు తదుపరి సీనియర్ అసిస్టెంట్ కి ప్రమోషన్ ఇవ్వకుండా ఎందుకోసం నిరీక్షిస్తున్నారో అర్థం కావడం లేదు.
- అసలు కారణం అదేనా..?
ఇదిలా ఉండగా మరి కొంతమంది జిల్లా విద్యాశాఖ సిబ్బంది మాత్రం నిజామాబాద్ జిల్లాలో మే నెల చివరలో ఖాళీ అయ్యే సూపరింటెండెంట్ పోస్టును ఇక్కడి వ్యక్తికే కట్టబెట్టాలని, హెచ్ఆర్ఏ, సీసీఏ అలవెన్స్, ఇతర వెసులుబాటులు పొందాలనే ఉద్దేశంతో పైరవీలు చేస్తూ ప్రమోషన్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆర్జెడీ కార్యాలయ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆర్జేడీ కార్యాలయం అధికారులతో చనువుగా ఉండే డీఈవో కార్యాలయ ఉద్యోగి ఒకరు ఈ విషయంలో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పని చేసిన అధికారి ప్రస్తుతం వరంగల్ లోని కార్యాలయంలో ఉన్నతస్థానంలో ఉండడంతో తమ పని సులువుగా పూర్తి చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలకు తెరదించేందుకు ఆదిలాబాద్ డీఈవో కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టును సీనియర్ అసిస్టెంట్ తో భర్తీ చేసి తమ మీద వస్తున్న ఆరోపణలకు ఆర్జేడీ కార్యాలయ అధికారులు చెక్ పెడితే బాగుంటుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దీనిపై రాష్ట్ర, జోనల్ స్థాయి విద్యాశాఖ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
