- కబ్జాలపై నోరు మెదపని దేవాదాయ శాఖ
ఇందల్వాయి, బతుకమ్మ : దశాబ్దాల చరిత్ర కలిగిన ఇందల్వాయి రామాలయంలపై దేవాదాయ శాఖ సీతకన్నేసింది. ఒకప్పుడు ఖిల్లా రామాలయానికి సంబంధించిన దేవాతామూర్తుల రక్షణ నిమిత్తం ఇందల్వాయిలో ప్రితిష్టించి పూజలు చేశారని చరిత్ర ఉంది. నాటి సిర్నపల్లి దొరసాని శీలం జానకీ బాయి ఇందల్వాయి రామాలయం పోషణ నిమిత్తం వందకు పైగా ఎకరాల భూమిని చుట్టు పక్కల ప్రాంతాల్లో దేవుని మణ్యంగా అందజేశారు. అంతే కాకుండా కొందరు దాతలు కూడా తాము దేవుని కోసమని భూ దానం చేశారు. అయితే దేవదాయ శాఖ నిర్లక్ష్య దోరణిలో భూములు హారతి కర్పూరం అయ్యాయి. ప్రస్తుతదేవాదాయ శాఖ వద్ద రామాలయానికి 45ఎకరాలు ఉన్నట్లు మాత్రమే రికార్డులు ఉన్నాయి. వాటిని కూడా స్థానిక గ్రామాల రైతులకు కౌలుకు కేటాయించారు. కౌలు సంగతి దేవుడెరుగు గానీ భూముల యాజమన్య హక్కులే మారిపోతున్నాయిని ఆరోపణలు ఉన్నాయి. కౌలు ఆదాయం రాకపోవడంతో చరిత్ర కెక్కిన రామాలయం కల్యాణ వేదిక,సత్రాలు మండపాలు, యాగశాల శిథిలావస్థకు చేరకుని కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. రామాలయానికి 187ఏళ్ల చరిత్ర ఉందని రికార్డులు చెబుతుండగా డిచ్ పల్లి మండలం సుద్దులం, కోరట్ పల్లి శివారులోని రామాలయ భూముల్లో రైతులు అక్రమంగా సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నాటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ సందర్శించి ఆలయ అభివ్రుద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారడంతో పాలకుల హామీ అటకెక్కింది. రామాలయానికి చెందిన భూములు ప్రస్తుత మార్కెట్ లో లక్షలు విలువ చేస్తుండటంతో వాటిని చెరబట్టేందుకు కౌలు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వ హయాంలో నూతనంగా వస్తున్న భూ భారతి పోర్టల్ లో భూములను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలసింది. గతంలో ప్రభుత్వం సాదాబైనామాలపై యాజమాన్య హక్కులు కల్పించే వ్యవహారాన్ని ధరణిలో చేపట్టింది. 2016 వరకు సాదాబైనామాపై ఉన్న భూములకు యాజమాన్య హక్కులు వచ్చాయి. కొత్తగా ప్రభుత్వం భూ భారతి ద్వారా తమకు కొత్త పట్టాలు, యాజమాన్య హక్కులు కల్పించాలని లీడర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే గతంలోనే దేవాదాయ శాఖ రామాలయ భూముల విషయంలో కోర్టును ఆశ్రయించడంతో స్టే కొనసాగుతోంది. కేసులు నడుస్తుండగానే భూములను క్రమ బద్దీకరించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
- దేవాలయ భూములను కబ్జా చేస్తే చట్ట ప్రకారం చర్యలు..
- ఇందల్వాయి తహసీల్దార్ ప్రభాకర్.
రామాలయ భూములను ఎవరు కబ్జా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కొందరు రైతుల అక్రమంగా సాగు చేయడమే కాకుండా వాటిని కబ్జాకు ప్రయత్నిస్తున్న విషయం అధికారులకు తెలిసింది. త్వరలోనే కోరట్ పల్లి, సుద్దులం శివారలో ఉన్న ఆలయ భూములను స్వాధీనం చేసుకుంటాం. అధికారికంగానే కౌలు భూములను రైతులకు కేటాయిస్తాం.
