చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్ లో ఘటన
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈఘటనలో ఇప్పటివరకు 16 మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా, యశోద (మలక్ పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్ర కుమార్ (67), అభిషేక్ మోదీ (30), సుమిత్ర(65), మున్నీబాయి (72), అరుషి జైన్(17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజనీ అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కీ మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ మృతులను గుర్తించారు.
సీఎం రేవంత్ ద్రిగ్భాంతి..
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
అగ్నిమాపక శాఖ సాంకేతికను అందిపుచ్చుకోవాలి : కిషన్ రెడ్డి
గుల్జార్ హౌస్ వద్ద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగిందని, సహాయక చర్యల్లో అగ్ని మాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని ఆయన తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని, అలాగే సాంకేతికను అందిపుచ్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరపున సాయం అందిస్తామని తెలిపారు.
