25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్ జిల్లా

Must read

📰 Generate e-Paper Clip

. . . రికార్డు స్థాయిలో ఇప్పటికే 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

. . . 34328 మంది రైతులకు రూ.549.85 కోట్ల బిల్లుల చెల్లింపులు

. . . కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి

నిజామాబాద్, బతుకమ్మ :

 

వానాకాలం – 2025 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరి ధాన్యం సేకరణ, పత్తి , మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే దాదాపు యాభై శాతం మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం పట్ల కలెక్టర్ ను, సంబంధిత అధికారులను అభినందించారు. ఇదే స్పూర్తితో మిగిలిన ధాన్యాన్ని సైతం పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని మంత్రుల దృష్టికి తెచ్చారు. ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ సీజన్ లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా 717 కేంద్రాలను నెలకొల్పి  ఇప్పటికే 50 శాతం వరకు సేకరణ పూర్తి చేశామని తెలిపారు. మరో వారం రోజుల్లో సింహభాగం వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని అన్నారు. సేకరించిన వరి ధాన్యంలో సన్న రకం ధాన్యం 3.21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దొడ్డు రకం ధాన్యం 25.9 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వివరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి 34328 మంది రైతులకు వారి ఖాతాలలో రూ. 549.85 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. సోమవారం ఒక్క రోజే రూ. 105 కోట్ల రూపాయల బిల్లులు రైతులకు చెల్లింపులు జరిగాయని వివరించారు. కాగా, జిల్లాలో మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను కూడా రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 17 వేల మెట్రిక్ టన్నుల వరకు మొక్కజొన్న కొనుగోలు జరిగిందని 25 వేల మెట్రిక్ టన్నుల వరకు మొక్కజొన్న సేకరణ జరుగుతుందని తెలిపారు. మొక్కజొన్న పంట ఎకరాకు 18 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితిని పెంచాలని తాను కోరిన ప్రతిపాదనను అనుమతించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని కలెక్టర్ అన్నారు. సోయాబీన్ సేకరణ కోసం ఈ పంట సాగు చేసిన ప్రాంతాలలో పది కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి సోయాబీన్ సేకరణ జరుపుతున్నామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, మార్క్ ఫెడ్ డీఎం మహేష్, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad district tops in grain procurement

More articles

Latest article