హైదరాబాద్, బతుకమ్మ :
ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలోని ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు అప్‌గ్రేడ్ చేయాలని కూడా కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), వెడ్మ బొజ్జు (ఖానాపూర్) పాల్గొన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ కూడా హాజరయ్యారు.