ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :తాను చిన్నప్పుడు చదువుకున్న బడికి ఎంతో కొంత సహాయం చేయాలనే తపనతో తాను పుట్టి పెరిగి తాను చదువుకున్న గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల లో టీచర్ల కొరత తీర్చాలనే ఉద్దేశ్యంతో ప్రయివేట్ టీచర్ ల వేతనం కోసం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తయ్యకు గ్రామ మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రుల తరపున చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు.
