జుక్కల్, బతుకమ్మ : భారత మాజీ మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పారని అన్నారు. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు. ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు నేటితరం నాయకులకు, యువతకు సైతం స్ఫూర్తిదాయకమని తెలిపారు. బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందిరా గాంధీ భారత స్త్రీ శక్తికి ప్రతీక అని, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వెల్లడించారు. అవకాశాలు వస్తే అద్భుతాలు చేయగలం అంటూ నిరూపించారని..ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ యువ నాయకుడు అధ్యక్షులు సతీష్ పటేల్, మాజీ మద్నుల్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సాయ గౌడ్, సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, గంగు నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.