… జాకోరా- చందూర్ ఎత్తిపోతల పథకం ప్రారంభం
బాన్సువాడ బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. బుధవారం ఉదయం వర్ని మండల జాకోరా- చందూర్ ఎత్తిపోతల పథకం ను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ… సిద్ధాపూర్ రిజర్వాయర్ కు మరో రూ.200 కోట్లు మంజూరు చేస్తామని, నిజాంసాగర్ ప్రాజెక్టు పూడికతీత పనులు చేపడతామని పేర్కొన్నారు. రిజర్వాయర్ ద్వారా 7900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా ముందుకెళ్తామని ఆయన తెలిపారు.కాంగ్రెస్ హయంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల పరిస్థితి ఏమైందో అందురూ గమనించాలని, ఆ ప్రాజెక్టులు వాళ్ల పాలనలోనే కూలిందని ఎద్దేవా చేశారు. డిజైన్లు, నిర్మాణం లోపభూయిష్టం కారణమని నిపుణులు చెప్పారు. రాష్ట్రంలో 1.05 కోట్ల మందికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని, వరి రైతులకు ప్రభుత్వం రూ.35 వేల కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జహిరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తదితరులు పాల్గోన్నారు.
