- కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
- రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై సమీక్ష
నిజామాబాద్, బతుకమ్మ: పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మినీ ట్యాంక్ బండ్ తో పాటు న్యాల్ కల్ రోడ్ ఆర్టీసీ డిపో-2, పద్మానగర్, గౌతంనగర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రదేశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అనువైన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద ఆహ్లాదకర వాతావరణం, ఉద్యానవనం, చిన్నారుల కోసం ప్లే జోన్ తదితర వసతులు ఉండడాన్ని గమనించిన కలెక్టర్, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న బాక్స్ క్రికెట్ ను వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా దీని నిర్వహణను ప్రైవేట్ వారికి వేలంపాట ద్వారా కేటాయించాలని ఆదేశించారు. రఘునాథ చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెలకు పూర్తి స్థాయిలో అద్దె వసూలు చేయాలని, ప్రస్తుతం ఇందులో ఉంటున్న వారు అద్దె చెల్లించకపోతే వారి ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త వారికి మడిగెలు అద్దెకు ఇవ్వాలని సూచించారు. దీనివల్ల నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా పచ్చదనాన్ని పెంపొందిస్తూ, మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అన్నారు. అనంతరం పద్మానగర్, న్యాల్కల్ రోడ్, గౌతంనగర్ లలో చేపట్టనున్న ఇంజనీరింగ్, రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన ప్రదేశాలను కలెక్టర్ సందర్శించి, అధికారులకు సూచనలు చేశారు. గౌతంనగర్ లో మంచినీటి ట్యాంక్ కు మరమ్మతులు జరిపించాలని, ట్యాంక్ చుట్టూ నీరు నిలువ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష..
నిజామాబాద్ నగర పాలక సంస్థ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన సూచనలను పక్కాగా పాటిస్తున్నారా, ఏమేరకు ప్రగతి సాధించారు అనే అంశాలను కలెక్టర్ పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరులో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రెవెన్యూ విభాగం పనితీరులో మార్పు కానరాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యుటేషన్ లకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని సూచించినప్పటికీ ఎందుకు అలసత్వం వహిస్తున్నారని రెవెన్యూ విభాగం అధికారులను నిలదీశారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారులే సంబంధిత పోర్టల్ ద్వారా మ్యుటేషన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా నేరుగా నగర పాలక సంస్థ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే, వారి దరఖాస్తులను కూడా రెవెన్యూ విభాగం అధికారులు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. పన్ను వసూళ్లు, మ్యుటేషన్ తదితర ప్రక్రియలు అన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని, జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. పన్ను వసూళ్లు వంద శాతం జరగాలని, భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమద్దీకరణ ప్రక్రియలను వెంటవెంటనే చేపడుతూ నగర పాలక సంస్థకు ఆదాయ వనరులను పెంపొందించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
