. . . స్మశానాన్ని కబ్జా చేసి ప్లాట్ల విక్రయం
. . . గత పాలకవర్గం హయంలో మరో వెంచర్ నంబర్ వేసి ప్లాట్ల అమ్మకాలు
. . . సమాదులను పూడ్చివేసి ప్రహారి నిర్మాణం
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని బాబాన్ సహాబ్ పహాడ్ వెనుక ప్రాంతంలో హిందూవుల స్మశాన వాటిక కబ్జాకు గురైంది. 12వ డివిజన్ లోని బాబాన్ సహాబ్ పహాడ్ వెనుక ఉన్న స్మశానవాటికను మజ్లీస్ పార్టీ నేత ఒకరు చెరబట్టాడు. బాబాన్ సహాబ్ పహాడ్ ప్రాంతంలో ఒకప్పుడు మెజార్టీ ప్రజలైన హిందువులు ఉండేవారు. ఇప్పటికీ అక్కడ ఆలయాలు, ఇళ్ళతో పాటు స్మశాన వాటిక కూడా ఉంది. దాదపు ఎకరం స్థలంలో ఉన్న బొందలగడ్డపై కన్నేసిన పతంగి పార్టీ నాయకుడు అక్కడ వెంచర్ చేశాడు. స్థానికంగా గంగాధర్ అనే వ్యక్తి కుటుంబం అక్కడ ఉంటూ స్మశాన వాటికను పరీరక్షించేవారు. కొన్ని రోజుల క్రితం అతను కాలం చేయడంతో అక్రమార్కులకు అది వరంగా మారింది. 12వ డివిజన్ కార్పొరేటర్ మజ్లీస్ పార్టీకి చెందిన వారే ఉండగా గత మేయర్ కాలంలో ప్రజాప్రతినిధి భర్త సహాయంతో అక్కడ ప్లాట్లను చేసి విక్రయించడం గమనార్హం.

స్థానికంగా కొందరు వ్యక్తులు స్మశానవాటికను ఆనుకుని 2026 సర్వే నంబర్ లో వెంచర్ ను చేసి ప్లాట్లను విక్రయించారు. అదే నంబర్ ను స్మశాన వాటికకు ఆపాదించి 25 ప్లాట్లను తీసి విక్రయించడం విశేషం. అక్కడ ఉన్న బొందలగడ్డ లో ఉన్న సమాదులను చదును చేసి కనిపించకుండా ప్లాట్లను విక్రయించినట్లు తెలిసింది. స్థానికంగా ఉండాల్సిన ప్రజలు వెల్లిపోవడంతో మైనార్టీలు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇతర ప్రాంతాల్లో వలస వెళ్లడంతో ఇప్పుడు అక్కడ స్మశాన వాటిక కరువై పోయింది. ఒకటి, రెండు సమాదులు ఉండగా అవి కనిపించకుండా ఫ్రీకాస్ట్ నిర్మాణం చేసి ప్లాట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడ గుట్టను తొలిచి మొరం విక్రయించినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. గత ప్రభుత్వ హయంలో బీఆర్ఎస్ నాయకులు మజ్లీస్ పార్టీ నాయకులతో చెట్టాపట్లాలు వేసుకుని తిరుగడమే కాకుండా బొందలగడ్డను కబ్జా చేయడానికి సహాయం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఈ విషయంపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. పతంగి పార్టీలో కీలక స్థానంలో ఉన్న నేత తన అనుచరుడితో కలిసి ప్లాట్ల దందాను చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 25 ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకోవడం దానికి అధికారులు, పాలకులు మద్దతు తెలుపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

