. . . ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
. . . వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిపుణ హ్యుమన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో మార్చి 17న విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ మెగా జాబ్ ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గౌరవ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ మెగా జాబ్ ఫెయిర్ ద్వారా జిల్లాలోని, పరిసర ప్రాంతాల విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను ప్రదర్శించి మంచి సంస్థల్లో ఉద్యోగాలను పొందాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి మాట్లాడుతూ ఈ జాబ్ ఫెయిర్‌లో సుమారు 50 కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5000కు పైగా ఉద్యోగ అవకాశాలను అందించే అవకాశం ఉందని తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్, కోర్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, మేనేజ్‌మెంట్ వంటి వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొంటాయని చెప్పారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా. పాత నాగరాజు మాట్లాడుతూ ఈ జాబ్ ఫెయిర్‌కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యార్థుల నమోదు, ఇంటర్వ్యూ ప్రక్రియ, ఇతర ఏర్పాట్లపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొనే అవకాశముందని తెలిపారు. 2016 నుండి 2026 వరకు చదువులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ఈ జాబ్ ఫెయిర్‌లో పాల్గొనవచ్చని చెప్పారు. అభ్యర్థులకు ఉచిత నమోదు కల్పించబడిందని, ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బ్రోచర్ విడుదల కార్యక్రమంలో నిపుణ హ్యుమన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు హర్ష, అనూషా రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ పీఆర్‌ఓ డా. రమణాచారి, ప్రొఫెసర్ సి.హెచ్. ఆంజనేయులు, డా. నాగరాజు, డా. వసం చంద్రశేఖర్, డా. బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
