27.3 C
Hyderabad
Friday, July 31, 2026

కార్మికులందరికీ మేడే రోజు సెలవు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అన్ని రంగాల కార్మికులకు మేడే రోజు సెలవు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, అసిస్టెంట్ కమీషనర్ శ్రావణి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికులందరికీ మేడే పండగ రోజన్నారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా మేడే సెలవు రోజుగా పరిగణించబడుతుందన్నారు. కానీ  మేడే సెలవు రోజును పెయిడ్ హాలిడేగా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. దీంతో మేడే రోజు సెలవు ఉండదని, ఐతే పనిచేసిన కార్మికులకు అదనపు వేతనం   ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ ఏ యాజమాన్యం కార్మికులకు అదనపు వేతనం ఇవ్వడం లేదన్నారు. అదే సమయంలో కార్మికుడు మేడే సెలవును కోల్పోతున్నాడన్నారు. కార్మికులను సంఘటితం కాకుండా, వారు పోరాట స్ఫూర్తికి దూరంగా నెట్టవేయడానికి, మేడే జరుపుకోకుండా మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికలోకం తిప్పికొట్టాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. జిల్లాలోని కార్మికులు మేడే రోజు సెలవు తీసుకోవాలని, అనివార్యంగా పనిచేస్తే యాజమాన్యాన్ని అదనపు వేతనం అడగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  టియూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్ జిల్లా నాయకులు పి.సాయన్న, నాయకులు ఇంతియాజ్, ధర్మపురి, కిషన్, గంగన్న, లక్ష్మీనారాయణ, నర్సింగరావు, గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

May Day should be given to all workers.

More articles

Latest article