తెరపైకి మాస్టర్ ప్లాన్

0 84,586
  • ప్రభుత్వం వద్దే పెండింగ్ లోనే నిజామాబాద్ మాస్టర్ ప్లాన్
  • కొత్తగా ఆర్మూర్, బోధన్ ల మాస్టర్ ప్లాన్ రూపకల్పన

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని పట్టణాల రూపురేఖలను మార్చేందుకు మాస్టర్ ప్లాన్ ల రూపకల్పనలకు రంగం సిద్దమైంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కు 1973లో చేసిన మాస్టర్ ప్లానే ఇప్పటి వరకు కొనసాగింది. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ గత ప్రభుత్వ హయంలో రూపొందించిన ముసాయిదా ప్లాన్ ప్రభుత్వం వద్దనే పెండింగ్ లో ఉంది. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కసరత్తు చేసింది. అందులో భాగంగా డ్రాఫ్ట్ ప్లాన్ ను రూపొందించి ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా  సేకరించింది. అభ్యంతరాలను స్వీకరించి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. గత కొన్ని సంవత్సరాలుగా అది ప్రభుత్వం వద్దనే పెండింగ్ లో ఉంది. 2023 చివరిలో జరిగిన ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ గురించి పోటీ పడిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అది అమలుకు నోచుకోలేదు.

Master plan on the screen

అమృత్ 2.0లో భాగంగా  నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన తొలి సమావేశం జరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరుస్తూప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ దోహదపడనుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత నమూనాలో ముసాయిదా  మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అవసరమైన వివరాలను పక్షం రోజుల లోపు సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే పై రెండు మున్సిపాలిటీలలో డ్రోన్ సర్వే పూర్తి చేయగా,ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పరిశీలన ప్రక్రియ కూడా జరిపారు. సంబంధిత శాఖలు అందించే వివరాలను క్రోడీకరిస్తూ, ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళిక రూపొందుతుంది. ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగాక, దానిపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఏవైనా అభ్యంతరాలు వస్తే, వాటిని పరిష్కరించి తుది మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదం నిమిత్తం ప్రభుత్వానికి పంపుతారు. ఇప్పటికే నిజామాబాద్ నగర ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు.

Leave A Reply

Your email address will not be published.