కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాల ఎదుట మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాధ్యులు మాట్లాడుతూ ఆజ్ఞానం మూర్తీభవించిన ఆనాటి సమాజంలో ఒక వెలుగు రేఖ, మోసగింపబడిన యువతులను కన్నతల్లిగా ఆదరించిన తల్లిసావిత్రిబాయి పూలే1831 జనవరి 3 న దక్షిణ మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ గ్రామంలో జన్మించిందని తెలిపారు. సావిత్రిబాయి పూలే ఆమె భర్త మహాత్మ జ్యోతిరావు పూలే దగ్గర కుల మతాలు సమాజానికి చేస్తున్న కీడు గురించి స్త్రీలపై జరుగుతున్న అనిచివేత గురించి పాఠాలు నేర్చుకుందన్నారు. స్త్రీలు, అట్టడుగు వర్గాల వారు చదువు నేర్చుకోవడాన్ని వ్యతిరేకించిన ఆ రోజుల్లో భర్త నుంచి చదువు నేర్చుకుని ఆనాటి కట్టుబాట్లను ఎదిరించి 1848 పాఠశాలలను ప్రారంభించి మహిళలకు విద్యాబుద్ధులు నేర్పిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలని తెలిపారు. సాంఘిక దురాచారాలపై, వితంతువుల కోసం, అనాధ పిల్లల కోసం శరణాలయాలను నడిపిందన్నారు. స్త్రీల ప్రగతి కోసం, స్త్రీల సమానత్వం కోసం, సంఘసేవిక, కవయిత్రిగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం జీవితాంతం సత్యశోధకు సమాజ్ ద్వారా పాటుపడిందనితెలిపారు. తన భర్త చనిపోయినప్పుడు స్వయంగా తానే అంత్యక్రియలు( కర్మకాండ) జరిపిందని తెలిపారు. 1897 మార్చి 10న ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలు చేస్తూ మరణించిందన్నారు. ఇలాంటి మహనీయురాలు జయంతి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం సంతోషమన్నారు. సామూహిక అక్షరాభ్యాసం ప్రతి సంవత్సరం సావిత్రి మాత జయంతి సందర్భంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఖ్యాతం సిద్ధిరాములు, బామ్ సేఫ్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి నరేందర్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా అధ్యక్షులు గంగారం, బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు లెన్ ఆజాద్, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ , దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదం, అరుణ్,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు శివరాములు, రాజయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
