కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ ఇందిర నగర్ నివాసుడైన షేక్ దాహుద్ కు హత్యాయత్నం, దళితుణ్ణి కులం పేరుతో దూశించిన నేరాలలో పది, మూడు సంవత్సరాల చొప్పున జైలు శిక్షలు విధిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి తూము కుంట శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రం మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్ గా పనిచేస్తున్న సర్కిల్ చంద్రశేఖర్, షేక్ దాహుద్ వ్యక్తిగత పరిచయస్థులు. 8 ఫిబ్రవరి, 2021 న మద్యం తాగుదామని చంద్రశేఖర్ ను బలవంతంగా నాక్ సెంటర్ అజంపురకు దాహుద్ తీసుకువెళ్ళాడు. అక్కడ మద్యం కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో తన దగ్గర డబ్బులు లేవని చంద్రశేఖర్ తెలిపిన అతను వినలేదు. శేఖర్ ను కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దూశించి అవమానించాడు. అంతకే ఊరుకోక శేఖర్ పై రాళ్ళతో కొట్టి తీవ్రంగా గాయలపాలు చేసి హత్యాయత్నం చేశాడు. సదరు నేర అభియోగాలు స్పెషల్ కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు న్యాయమూర్తి శ్రీనివాస్ నిర్దారించారు. భారత శిక్షాస్మృతి సెక్షన్ 307 హత్యాయత్మం నేరానికి గాను పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా రెండు నెలల జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల పై అత్యాచారాల చట్టంలోని మూడు సెక్షన్స్ లలో మూడు సంవత్సరాల చొప్పున కఠిన జైలు శిక్షలు విధించారు. వేయి రూపాయల చొప్పున మూడు వేలు జరిమానా చెల్లించాలని జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు. శిక్షలన్ని ఏకకాలంలో అనుభవించాలని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ నిర్వహణలో స్పెషల్ పిపి దయాకర్ గౌడ్ కు సహాయకారిగా పోలీస్ లైజన్ అధికారి రాజేశ్వర్ ఉన్నారు. కోర్టు కన్విక్షన్ వారంట్ స్వీకరించిన పోలీసులు ముద్దాయి షేక్ దాహుద్ ను నిజామాబాద్ కేంద్ర కారాగారానికి తరలించారు.
