నిజామాబాద్ లీగల్, బతుకమ్మ
మహిళను హత్య చేసిన షేక్ మహబూబ్ కు జీవితఖైదు విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ సోమవారం తీర్పు వెలువరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పిపి వెల్లడించిన తీర్పులోని వివరాలు. ఆర్మూర్ పట్టణంలోని మామిడి పల్లి, మహాలక్ష్మి కాలోని నివాసుడైన షేక్ మహబూబ్ కు కల్లు తాగే అలవాటు ఉంది. కల్లుబట్టిలో మిర్యాల పోషవ్వ కూడా కల్లు తాగడానికి వచ్చేది. అక్కడ ఇద్దరికి పరిచయం అయింది. పోషవ్వకు ముగ్గురు సంతానం. కొన్ని కారణాల వలన ఆమె భర్తకు పిల్లలకు దూరంగా ఉంటు జీవిస్తున్నానని తెలపడంతో ఇద్దరి మధ్య శరీరక సంబంధం ఏర్పడింది. ఆర్మూర్ లో ఉంటే తన భార్య పిల్లలకు తెలుస్తుందని షేక్ మహబూబ్ పోషవ్వతో మాట్లాడుకుని గోవింద్ పేట్ లోని యాల్ల నడిపి గంగారాం ఇంటిలో కిరాయికి ఉండి కూలి పని చేస్తూ జీవించేవారు. మహబూబ్ ఆర్మూర్ నుండి అప్పడప్పుడు వచ్చి వెళుతుండే వాడు. పోషవ్వకు ఆరోగ్యం బాగులేక పోవడంతో ఆసుపత్రిలో డాక్టర్ కు చూపించేవాడు. ఆమె ఆరోగ్యం ఎంతకు కుదుట పడకపోవడంతో కూలీనాలి చేసి బతుకే తన దగ్గర డబ్బులు కూడా లేవని అనడంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగేది. నువ్వు కూడా నన్ను విడిచి పెడితే ఎవరు లేని దానిని ఎలా బతకాలి అని ఆమె ప్రశ్నించేది.పోషవ్వ చంపివస్తే పీడ వదులుతుందని బావించిన షేక్ మహబూబ్ 25 జనవరి, 2025 న గోవింద్ పేట్ లోని ఇంటిలో అనారోగ్యం వలన పడుకుని ఉన్న పోషవ్వ ముక్కు మూసి ఉరిరాడకుండా చేసి కుడి పక్కటెముకలలో బలంగా గుద్ది చంపివేసి ఇంటికి తాళం వేసి యాదావిదిగా ఆర్మూర్ చేరుకున్నాడు.ఇంటి నుండి దుర్వాసన రావడంతో యాల్ల రాజ్ కుమార్ ఎదో ప్రమాదం జరిగి పోయిందని ఆర్మూర్ పోలీసులకు 30 జనవరి, 2025 న పిర్యాదు చేశాడు. నేర విచారణ జరిపిన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ పి. సత్యనారాయణ షేక్ మహబూబ్ ను 3 పిబ్రవరి,2025 న అరెస్ట్ చేసి సాక్షుల సమక్షంలో అతని నేరం ఒప్పుకోలు పంచానామా నమోదు చేసుకుని పూర్తి నేర విచారణ అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు నేర న్యాయ విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు, ధ్రువీకరించుకున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసుకుని ప్రాసిక్యూషన్, ముద్దాయి తరపున న్యాయవాది వాదనలు విని సోమవారం తీర్పును సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ చెప్పారని పిపి రాజేష్వర్ రెడ్డి తెలిపారు. హత్య నేరంకుగాను జీవిత కారాగార శిక్ష,సాక్ష్యాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసినందుకుగాను ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు తెలిపారు. శిక్షలన్నీ ఏక కాలంలో అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారని పిపి వివరించారు.
