- తెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : చరిత్రను చదవడం కాదు మహాత్మ జ్యోతిరావు పూలేలా చరిత్రను సృష్టించాలని తెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహాత్మా జ్యోతి భాఫూలే 198వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతదేశ సామాజిక సమ్మిళిత,అభివృద్ధిలో మహాత్మ జ్యోతి భాఫూలే పాత్ర అనే అంశంపై బీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ అరతి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ 19వ శతాబ్దిలో తరతరాల అంధకారం, వర్ణ విభజన, కులాల దొంతరుల మధ్యన నలుగుతున్న అంధకారం సమాజాన్ని నిలదీసిన సామాజిక, సాంఘిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చరిత్రను చదవడం కాదు మహాత్మ జ్యోతిబాపూలేల చరిత్రను సృష్టించాలన్నారు. నిచ్చనమెట్ల సామాజిక వ్యవస్థలో దళితులు, వెనుకబడిన వర్గాలు మరియు మహిళల హక్కుల కోసం ఆయన చేసిన సేవలుచరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్న ఆచార్య సిహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్త్రీ విద్యకు మార్గదర్శిగా ఉండి,భారతదేశంలో మహిళల విద్యకు అడ్డంకులను తొలగించడానికి పోరాడి 1848లో తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి భారతదేశంలో మొదటి బాలికల పాఠశాలను పునేలో స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో స్త్రీల స్థానమును మెరుగుపరిచారన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన డాక్టర్ ఏ. పున్నయ్య మాట్లాడుతూ గులాం గిరి (1873)అనే పుస్తకంలో బ్రాహ్మణ్యవాదం మరియు జాతి వివక్షను ఖండించారన్నారు. ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేసిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి మాంధాత సీతారామమూర్తి మాట్లాడుతూ సత్యశోధక్ సమాజ్ (1873)స్థాపించి, సమానత్వ సమాజం కోసం పోరాడారన్నారు.దళితులు మరియు వెనుకబడిన వర్గాల ఉద్ధరణ అంటరానితనాన్ని, అస్పృశ్యతను తీవ్రంగా ఖండించారని,దళితులకు విద్య, హక్కులు కల్పించడానికి పాఠశాలలు, సామాజిక సంస్థలు స్థాపించారు. సామాజిక న్యాయం కోసం చట్టపరమైన మార్పులను కోరారన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ మహాత్మా ఫూలే కుటుంబ సంస్కరణలు వితంతు వివాహాలు, స్త్రీ హక్కులు, బాల్యవివాహాల నిర్మూలన వంటి సంస్కరణలను ప్రోత్సహించిన మహానుభావుడన్నారు. డాక్టర్ స్వప్న మాట్లాడుతూ స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం మహాత్మా పూలే కృషి చేశాన్నారు. డాక్టర్ నీలిమ మాట్లాడుతూ సామాజిక ఐక్యత కోసం పోరాటంసర్వమత సమాజ్ స్థాపించి, అన్ని మతాలు మరియు జాతుల మధ్య ఐక్యతను ప్రచారం చేశాన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థినే విద్యార్థులు పాల్గొన్నారు.

