- రూ.4.50 కోట్లతో డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన
బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ – వర్ని రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో వర్ని- నిజామాబాద్ రోడ్డుకు శంకుస్థాపన జరిగిన నిధులు లేని కారణంగా ఆ పనులు నిలిచిపోయాయి. దాంతో నిజామాబాద్ నగరం నుంచి వర్ని రోడ్డులో నగర శివారు వరకు రోడ్డు ఇరుకుగా మారింది. ప్రధానంగా వర్ని చౌరస్తా మొదలుకుని గొల్లగుట్ట తాండ పంచాయితీ వరకు రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా మారిన వర్ని రోడ్డు రూపురేఖలు మారలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నాగారం వద్ద నిజాంసాగర్ కెనాల్ కు బ్రిడ్జి నిర్మించి వదిలేశారు.

రోడ్డును మాత్రం డెవలప్ చేయలేదు. నగరం నలుదిక్కులా నాలుగు లైన్ ల రోడ్డు ఉన్నప్పటికీ వర్నిరోడ్డులో మాత్రం ఇప్పటికి సింగిల్ రోడ్డు ఉండడం ఇప్పటికి ఇబ్బందిగా మారింది. నిజామాబాద్ నగరానికి దక్షిణ వైపున వర్ని రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. దాంతో వర్ని చౌరస్తా మొదలుకుని గొల్లగుట్ట తాండ వరకు పది వేల జనాభా ఉన్నప్పటికీ రోడ్డు మాత్రం వెడల్పు లేక రోడ్డు ప్రమాదాలకు గురయ్యే వారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మారడంతో జిల్లా నలువైపులా రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ – వర్ని రోడ్డుకు మూడున్నర కిలో మీటర్ల దూరంనాలుగు లైన్ల పనులకు సోమవారం పునాదులు పడ్డాయి. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి , జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుఆధ్వర్యంలో నాలుగున్నర కోట్ల నిధులతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతూకిరణ్, ఉర్ధూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ – వర్ని రోడ్డుతో పాటు నిజామాబాద్ – నర్సీ రోడ్డుకు జూపల్లి శంకుస్థాపన చేశారు. 8.2 కిలో మీటర్ల దూరం, ఆరు కోట్ల నిధులతో చేపట్టే పనులకు జూపల్లి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హరూన్ ఖాన్, నాయకులు ఫహీం తదితరులు పాల్గొన్నారు.
