-ఇంచార్జీ జిల్లా జడ్జి దుర్గా ప్రసాద్
నిజామాబాద్, బతుకమ్మ :
కోర్టులపై పని భారాన్ని తగ్గించడానికి రాజీ పద్ధతిన సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారం ఒక పద్ధతి ని నేర్పిందని ఇంచార్జీ నిజామాబాద్ జిల్లా జడ్జి డి. దుర్గా ప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు,డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి లతో కలిసి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ ను జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కక్షిదారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులనుద్దేశించి ఆయన ప్రధానోపన్యాసం చేశారు. న్యాయసేవల చట్టం ద్వారా న్యాయార్థులకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యాయ ఫలాలు అందించడానికి కృషి జరుగుతుందని ఆయన తెలిపారు.జనుల మధ్య విభేదాలు సహజమేనని అవి దీర్ఘకాలం ఉండరాదనే లక్ష్యంతో న్యాయ సేవ అధికార సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాకుండా ఎక్కడ తగ్గాలో లోక్ అదాలత్ నేర్పిందని ఆయన విశ్లేషించారు.ఏ న్యాయ దావాలైన పరిష్కరించడానికి న్యాయస్థానాలకు సమయం పడుతుందని కాని ఇరు పక్షాలు ఒక పరిష్కారానికి వస్తే లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సెలవు రోజైనా ఆదివారం కూడా కోర్టులు ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. కేసుల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ర్యాంక్ లభించడమంటే, కోర్టులలో కేసులు తగ్గుతున్నాయన్న మాటేనని ఆయన వివరించారు.మర్డర్, రేప్, పోక్సో లాంటి తీవ్రమైన కేసులలో తప్ప మిగతా కేసులలో రాజీకి వీలున్నదని ఆయన అన్నారు. అనంతరం ఆయన లోక్ అదాలత్ అవార్డులను మోటారు వాహన రోడ్డు ప్రమాద బాధితులకు అందజేశారు.నిజామాబాద్ అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రసంగిస్తూ జిల్లా అధికార యంత్రాంగం జిల్లా న్యాయ వ్యవస్థ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో తన వంతు చేయూతను అందిస్తోంది అన్నారు.లోక్ అదాలత్ తో చాలా ప్రయోజనాలను ప్రజలకు ఉన్నాయని ఆయన తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతూ ప్రతి జాతీయ లోక్ అదాలత్ కు న్యాయవాదులు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి ప్రసంగిస్తూ పదేపదే నేరాలకు పాల్పడకుండా సమాజంలో శాంతికి సహకరించాలని కోరారు.మనుషుల మధ్య కక్షలు మంచివి కావని, అవి నేరాలకు దారితీస్తాయని అన్నారు. లోక్ అదాలత్ లో న్యాయవాదుల త్యాగలు ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు.జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ సంస్థ లక్ష్యసాధనలో కలిసి వస్తున్న భాగస్వాముల భాగస్వామ్యం చాలా ఎక్కువ అని కొనియాడారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు గోపికృష్ణ, కుష్భూ ఉపాధ్యాయ,చైతన్య,హరి కుమార్ శ్రీనివాస్ రావు, కీర్తి రాజ్, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, న్యాయవాదులు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు అధికారులు, బీమా సంస్థల అధికారులు పాల్గొన్నారు.

