- ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయోనని ఆందోళన
- నిజామాబాద్ లో 8 మంది డ్రైవర్ల పోస్టింగ్ ల హూస్టింగ్
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. అదే సమయంలో కాలుష్యరహితంగా ప్రజలకు సేవ చేసేందుకు గాను విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ విషయంలో ముందుగా ప్రభుత్వం చొరవ తీసుకుని జేబీఎం సంస్థ ద్వారా అద్దె బస్సులను నడుపుతున్న విషయం తెల్సిందే. వాటిని నడిపేందుకు గాను ఏడాది క్రితం డ్రైవర్లను నియమించారు. వారు తాత్కాలిక పద్దతిన నియమితులు కాగా వారిని అద్దె బస్సులో నడుపడానికి నియమించారు. కానీ వారి ఉద్యోగాలు గాలిలో దీపాలుగా మారాయి.
నిజామాబాద్ జిల్లాలో ఏడాది కాలంలో 8 మంది బస్సు డ్రైవర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. అందుకు కారణం టిం సర్వీస్ ను సక్సెస్ ఫుల్ గా పని చేయడం లేదని ఒక కారణమైతే అక్యుపెన్సీ లేదని మరో కారణం. అంతేగాకుండా డిపో మేనేజర్లకు ఏ మాత్రం అనుమానాలు ఉన్నా సీ టూ డీఎం (డిపో మేనేజర్) అనే ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు అద్దె బస్సుల తాత్కాలిక డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 300 మంది డ్రైవర్లను నియమించగా ఇప్పటి వరకు 200 మంది తాము పని చేయలేమని చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఉన్న వారితో పని చేయించాలంటే డీఎంలు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. జై భారత్ మహాన్ (జేబీఎం) ద్వారా నియమితులైన వారిని అకారణంగా తొలగించిన ఘటనలు ఉన్నాయి.
ఇటీవల అద్దె బస్సుల డ్రైవర్లు ఒక యూనియన్ గా ఏర్పడిన నాటి నుంచి వారిపై కక్ష్యసాధింపు చర్యలు మొదలయ్యాయనే వాదనలున్నాయి. ముఖ్యంగా కార్యవర్గంలో ఉన్న నాయకులను ఒక్కొక్కరిగా ఏదో సాకుతో వేటువేయడం పరిపాటిగా మారింది. యూనియన్ లో బాధ్యతలు ఉన్న వారిని అధికారులు సాకులతో ఏరి వేస్తుండడంతో ప్రశ్నించే పరిస్థితి లేదని వాపోతున్నారు. టిం సర్వీసుల విషయంలో అద్దె బస్సు డ్రైవర్లకు ఒక రూల్ ను, రెగ్యులర్ డ్రైవర్లకు మరొక రూల్ ను అమలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. కొత్త రూట్లలో వెళ్లినప్పుడు స్టేజీల మార్చాల్సిన విషయంలో తప్పిదాలు జరిగినా బలి కావాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. జేబీఎం బస్సు డ్రైవర్లను డిపోల మేనేజర్లు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఒక డీఎం బావమరిదిని తోటి అద్దె డ్రైవర్లు ఏదో మాట తూలినందుకే తొలగించారన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉదంతాలను ఆర్టీసీ సీఎండీ ద్రుష్టికి తీసుకెళ్లినా స్థానికంగానే తేల్చుకోవాలని సూచిస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు.
